Andhra Pradesh: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పరిధి దాటి వ్యవహరిస్తుంటే ఈసీ ఏం చేస్తోంది?: యనమల
- మోదీకి ఈసీ అడ్డంకులు చెప్పడం లేదు
- ఏపీలో మాత్రం మమ్మల్ని అడ్డుకుంటున్నారు
- అమరావతిలో మీడియాతో ఏపీ ఆర్థిక మంత్రి
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు ప్రధాని మోదీ, ఈసీ, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం లేకుండా పాలన సాగించాలని ఏ రాజ్యాంగం చెప్పిందని యనమల ప్రశ్నించారు. బ్యూరోక్రాట్లు రాజ్యం చేయవచ్చని ఎక్కడైనా చెప్పారా? అని నిలదీశారు.
భారత రాజ్యాంగం కంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎక్కువా? అని అడిగారు. ప్రజాస్వామ్యానికే భగం కలిగించేలా ఈసీ నిబంధనలు విడుదల చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యనమల మాట్లాడారు.
కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తూ, నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని మోదీకి ఈసీ ఎలాంటి అడ్డంకులు చెప్పడం లేదని యనమల గుర్తుచేశారు. కానీ దేశంలోని బీజేపీయేతర ప్రభుత్వాలను మాత్రం పనిచేయనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎక్కడా కూడా కేబినెట్ కార్యదర్శి జోక్యం చేసుకోవడం లేదనీ, కానీ ఏపీలో మాత్రం ఈసీ నియమించిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుత సీఎస్ ఏపీ ప్రభుత్వం నియమించుకున్న వ్యక్తి కాదని స్పష్టం చేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం పరిధి దాటి వ్యవహరిస్తుంటే ఈసీ ఏం చేస్తోందని యనమల ప్రశ్నించారు. అసలు ఎన్నికల విధులు నిర్వర్తించాల్సిన వ్యక్తి ప్రజా పాలనను ఎలా అడ్డుకుంటారని అడిగారు.
ఈ విషయంలో ఎవరైనా కోర్టుకు వెళితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఆపద్ధర్మ ప్రభుత్వం కూడా పాలన చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ఇప్పుడున్నది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదనీ, ప్రజా ప్రభుత్వమని వ్యాఖ్యానించారు.