Sri Lanka: చచ్చాడా! పీడ వదిలిపోయింది!... శ్రీలంక పేలుళ్ల సూత్రధారి మరణంపై సోదరి స్పందన ఇది!
- జహ్రాన్ హషీమ్ మృతదేహాన్ని చూసేందుకు విముఖత
- ఫొటో చూపించండి గుర్తుపడతానన్న సోదరి మథానియా
- షాంఘ్రీలా హోటల్ లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన జహ్రాన్
ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో నెత్తుటేర్లు పారించిన ఉగ్రవాది జహ్రాన్ హషీమ్ కూడా ఆత్మాహుతి దాడికి పాల్పడి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఈస్టర్ సందర్భంగా కొలంబోలో చోటు చేసుకున్న వరుస పేలుళ్లకు సూత్రధారి జహ్రాన్ హషీమ్ అని పోలీసులు భావిస్తున్నారు. ఈ దాడుల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 253 మందికి పైగా మరణించడం తెలిసిందే.
అయితే, హోటల్ షాంఘ్రీలాలో ఆత్మాహుతి దాడిలో జహ్రాన్ హషీమ్ స్వయంగా పాల్గొన్నాడు. ఈ ఘటనలో జహ్రాన్ కూడా మరణించడంతో, ఆ ఘటనలో పాల్గొన్నది అతడేనా? కాదా? అని అధికారులు నిర్ధారించుకోవాలనుకున్నారు.
ఓ సైనిక ఇంటెలిజెన్స్ అధికారి కలుమునై ప్రాంతంలో నివసిస్తున్న జహ్రాన్ సోదరి మథానియా ఇంటికి వెళ్లారు. "మీ సోదరుడు జహ్రాన్ డెడ్ బాడీ అంపారా ఆసుపత్రిలో ఉంది. మీరు వచ్చి చూస్తే కన్ఫామ్ చేసుకుంటాం" అని మథానియాను కోరారు. దాంతో మథానియా "మీరు ఫొటో చూపించండి చాలు, అతడో కాదు గుర్తుపడతాను" అని బదులిచ్చింది.
అంతేకాకుండా, "రెండేళ్లుగా అతడితో మాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఇస్లాం పేరు చెప్పి తప్పుడు మార్గంలో పయనించాడు. ఖురాన్ చదివినవాడు మంచి మార్గంలో వెళ్లడానికి బదులు అమాయకుల్ని బలితీసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాడు చచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. జహ్రాన్ 6వ తరగతితో చదువు ఆపేసి ఇస్లామిక్ భావజాలంపై శ్రద్ధ పెట్టాడు. ఇస్లాం మీద ప్రసంగాలు అంటూ విషం చిమ్మేవాడు. ఇప్పుడీ పేలుళ్లలో చచ్చిపోయాడని తెలిసి నిజంగా ఆనందిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.