Sri Lanka: కాల్పుల ఘటనలో మరణించింది కొలంబో పేలుళ్ల సూత్రధారి తండ్రి, సోదరులే!
- వెల్లడించిన అంతర్జాతీయ మీడియా సంస్థ
- ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు
- లంక బలగాల కాల్పులు
శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ సందర్భంగా జరిగిన ఉగ్రదాడుల్లో వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరినీ కలచివేసింది. ఈ దాడుల్లో ప్రముఖ మసాలా దినుసుల వ్యాపారి కుటుంబం కీలకపాత్ర పోషించడం ఆశ్చర్యానికి గురిచేసింది. లంకలో సంపన్న కుటుంబంగా పేరుగాంచిన హషీమ్ ఫ్యామిలీకి ఉగ్రలింకులు ఉన్నాయని తెలిసి నివ్వెరపోయారు. పేలుళ్లకు ప్రధాన సూత్రధారి జహ్రాన్ హషీమ్ ఈస్టర్ రోజున తనను తాను పేల్చుకోగా, అతని సోదరులు, తండ్రి భద్రతా బలగాలతో తలపడి హతమైనట్టు తాజాగా వెల్లడైంది.
శుక్రవారం కల్మునై నగరంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కినట్టు సాయుధ బలగాలకు సమాచారం అందడంతో ఆ ఇంటిని చుట్టుముట్టారు. దాంతో ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. అయితే, తప్పించుకునే వీల్లేదని తెలియడంతో ముగ్గురు ఉగ్రవాదులు తమను పేల్చుకున్నారు. ఈ ఘటనలో 15 మంది వరకు మరణించారు.
ఆ ఘటనలో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులు ఎవరో కాదని, జహ్రాన్ హషీమ్ తండ్రి మహ్మద్ హషీమ్, సోదరులు జైనీ, రిల్వాన్ అని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. అంతకుముందు, జహ్రాన్ దగ్గరి బంధువు నియాజ్ షరీఫ్ కూడా ఈస్టర్ పేలుళ్ల సందర్భంగా తెరపైకి వచ్చిన వీడియోల్లో ఈ ముగ్గురూ ఉన్నట్టు గుర్తించాడు.