Foni: సూపర్ సైక్లోన్ గా మారిన 'ఫణి'... తీరం దాటేవేళ పెను విధ్వంసమే!
- 'ఎక్ స్ట్రీమ్ లీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్'గా 'ఫణి'
- మచిలీపట్నానికి 1,090 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
- 1న దిశను మార్చుకునే అవకాశం
- ముప్పు తప్పినట్టు భావించలేమంటున్న నిపుణులు
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి, ఆపై వాయుగుండంగా, తుపానుగా మారి సముద్రం నుంచి కదలని 'ఫణి', ఇప్పుడు మరింత ఉద్ధృతమై సూపర్ సైక్లోన్ గా మారింది. ఇది ప్రస్తుతం మచిలీపట్నానికి 1,090 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై, గంటకు 20 నుంచి 21 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.
మే 1 నుంచి తుపాను దిశను మార్చుకోవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నా, అది జరిగేంత వరకూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ముప్పు తప్పినట్టుగా భావించలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తుపాను తీరం దాటే వేళ, గంటకు 195 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని అంటున్నారు. తుపాను దిశను మార్చుకుంటే, వర్షాలకు బదులు వేడిగాలులు వీస్తాయని, మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని అంటున్నారు.
30వ తేదీ నుంచి సూపర్ సైక్లోన్ (ఎక్ స్ట్రీమ్ లీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్) ప్రభావం భారత్ పై కనిపిస్తుందని, ఆదివారం రాత్రి విడుదల చేసిన బులెటిన్ లో వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర తుపానుగా ఉన్న సమయంలో గంటకు 110–125 కి.మీ., అతి తీవ్ర తుపానుగా మారాక 130–155 కి.మీ., సూపర్ సైక్లోన్ అయ్యాక 160–195 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని వెల్లడించింది. సముద్రంలో అలలు భారీగా ఎగసిపడతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.