BJP: నన్ను తర్వాత ప్రశ్నిద్దురు కానీ.. ముందీ లెక్కలు చెప్పండి: మోదీకి మధ్యప్రదేశ్ సీఎం సవాలు
- బీజేపీ నేతలు తమ భార్యల నగలు అమ్మి డబ్బులు తెస్తున్నారా?
- ఢిల్లీలో బీజేపీ కార్యాలయానికి రూ.700 కోట్లు ఎక్కడివి?
- ప్రధాని విమాన ఖర్చులు భరిస్తున్నదెవరు?
ప్రధాని నరేంద్రమోదీపైనా, బీజేపీ నేతలపైనా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ఖర్చుల కోసం మీ భార్యల నగలు అమ్మి డబ్బులు తెస్తున్నారా? అని ప్రశ్నించారు.
‘‘మోదీని నేను ఒకటే అడగదలిచా. ఎన్నికల ఖర్చుల కోసం మీరు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు? మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ, ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లోనూ ఖర్చులకు, విమానాల్లో మీరు తిరగడానికి డబ్బెక్కడి నుంచి వస్తోంది? బీజేపీ నేతలు తమ భార్యల మెడల్లోని బంగారు నగలను విక్రయించి డబ్బు తీసుకొస్తున్నారా?’’ అని కమల్నాథ్ ప్రశ్నించారు.
ప్రధాని తన విమాన ఖర్చులు ఎవరు భరిస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిందేనని కమల్నాథ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో రూ.700 కోట్లు పెట్టి బీజేపీ కార్యాలయం కట్టిస్తున్నారని, అంత సొమ్ము ఎక్కడి నుంచి తెస్తున్నారో చెప్పాలని నిలదీశారు. తొలుత ఈ ప్రశ్నలన్నింటికీ ఆయన సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే తనను ప్రశ్నించాలని అన్నారు. కాగా, మోదీ వారణాసి రోడ్డు షో ఖర్చు రూ.70 లక్షలు దాటిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.