Andhra Pradesh: జగన్ విషయంలో ఎయిర్ పోర్టులోకి రాలేని పోలీసులు మమ్మల్ని ఎలా నిర్బంధించారు?: రామ్ గోపాల్ వర్మ
- నా ఫ్రెండ్ ఇంట్లో ప్రెస్ మీట్ పెడతానని చెప్పా
- అయినా పోలీసులు ఒప్పుకోలేదు
- హైదరాబాద్ లో వర్మ మీడియా సమావేశం
శాంతిభద్రతల సమస్యలతో పాటు ట్రాఫిక్ జామ్ తలెత్తే అవకాశం ఉన్నందున తన మీడియా సమావేశానికి అనుమతి రద్దు చేస్తున్నట్లు విజయవాడ పోలీసులు చెప్పారని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఇందుకు తాను అభ్యంతరం చెప్పలేదన్నారు. అయితే తనను బలవంతంగా విమానం ఎక్కించి హైదరాబాద్ కు పంపారనీ, దీన్ని నోటీసులో ఎక్కడా ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.
ఇలా చేయమని ఎవరు చెప్పారు? అని అడిగితే ఉన్నతాధికారులు అని పోలీసులు జవాబు చెబుతున్నారనీ, అయితే సదరు అధికారుల పేర్లను మాత్రం ప్రస్తావించడం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు వర్మ, నిర్మాత రాకేశ్ రెడ్డి మాట్లాడారు. ‘‘మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నామా? లేక నియంతృత్వ రాజ్యంలో ఉన్నామా’ అనే అనుమానం కలుగుతోంది.
జగన్ పై కోడి కత్తితో దాడి జరిగినప్పుడు ‘మాకు ఎయిర్ పోర్టు లోపల అధికారం లేదు. బయటే ఉంది’ అని ఏపీ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు మమ్మల్ని రోడ్డు పై నుంచి లాగేసి ఎయిర్ పోర్టులోని ఓ రూమ్ లో 7 గంటలు నిర్బంధించారు. జగన్ పై దాడి జరిగినప్పుడు రాలేని పోలీసులు మా విషయంలో ఎయిర్ పోర్టులోకి ఎలా వచ్చారు?’’ అని ప్రశ్నించారు.
తన ఫ్రెండ్ ఇంట్లో మీడియా సమావేశం పెట్టుకోవడానికి కూడా పోలీసులు అనుమతించలేదనీ, ‘మిమ్మల్ని మాట్లాడనివ్వకూడదని మాకు ఆర్డర్స్ ఉన్నాయి సార్’ అని పోలీసులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో ఈ విషయమై మాట్లాడే అవకాశం కూడా తమకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. నిన్నటి షాక్ నుంచి తాను ఇంకా బయటకు రాలేకపోతున్నానని వ్యాఖ్యానించారు.