Dubai: విధి విచిత్రం!... ఈయన వెళ్లిన రెండు చోట్లా ఉగ్రదాడులే!
- రెండు పర్యాయాలు ఉగ్రదాడుల నుంచి తప్పించుకున్న అభినవ్ చారి
- గతంలో ముంబయి పేలుళ్లకు ప్రత్యక్ష సాక్షి
- ఇప్పుడు కొలంబో పేలుళ్లను దగ్గరగా చూసిన వైనం
భారత సంతతికి చెందిన అభినవ్ చారి అనే వ్యక్తి దుబాయ్ లో నివసిస్తున్నాడు. చారి పెరిగింది దుబాయ్ లోనే. తనలాగే దుబాయ్ లో ఉంటున్న నవరూప్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలయ్యాడు. అయితే, అభినవ్ చారి తన జీవితంలో రెండు సార్లు మాత్రమే దుబాయ్ దాటి వెళ్లాడు. ఆ రెండు సార్లు కూడా భీకర ఉగ్రదాడులకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు.
మొదట వైద్య విద్య అభ్యసించేందుకు 2008లో ముంబయి వెళ్లాడు. భారత చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 26/11 దాడులు జరిగింది ఆ సమయంలోనే. 12 చోట్ల వరుస పేలుళ్లు, కాల్పులు జరిగాయి. అదంతా చూసి ఐదారు రోజులు తేరుకోలేకపోయానని అభినవ్ చారి మీడియాతో చెప్పాడు. తాజాగా, శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పేలుళ్లతో మరింత వణికిపోయాడు.
భార్య నవరూప్ తో కలిసి శ్రీలంక ట్రిప్ కు వచ్చిన చారి చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసిన అనంతరం అల్పాహారం తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే అప్పటికే బయటి వాతావరణంలో మార్పు వచ్చేసింది. జనం అటూ ఇటూ పరుగులు తీస్తూ కనిపించారు. ఏదో జరిగి ఉంటుందన్న అతడి అనుమానం నిజమైంది. ఉగ్రదాడి జరిగిందని తెలియడంతో హోటల్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నా, అప్పటికే అక్కడ కూడా పేలుడు జరిగిందని సమాచారం అందింది. దాంతో నిలుచున్న చోటే కంపించిపోయాడు.
ఈ రెండు ఘటనలపై మీడియాతో మాట్లాడుతూ, తాను దుబాయ్ నుంచి బయటికి వచ్చిన రెండుసార్లు ఉగ్రదాడులు జరగడం దిగ్భ్రాంతికి కలిగిస్తోందని అన్నాడు.