Nizamabad: నామినేషన్ వేయనీయకుండా అడ్డుకుంటున్నారు.. వారణాసిలో ఆందోళన చేపట్టిన నిజామాబాద్ రైతులు!
- మద్దతిచ్చిన స్థానికులకు సైతం బెదిరింపులు
- ఈసీకి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు
- ఐబీని రంగంలోకి దింపిన కేంద్రం
తమను నామినేషన్ వేయనీయకుండా ఎన్నికల కమిషన్, పోలీసులు అడ్డుకుంటున్నారని పేర్కొంటూ వారణాసిలో నిజామాబాద్, తమిళనాడు రైతులు ఆందోళన చేపట్టారు. తమకు మద్దతిచ్చిన స్థానికులపై సైతం బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు వాపోతున్నారు. ఈసీకి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎర్రజొన్నకు మద్దతు ధరతో పాటు, పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి సిద్ధమయ్యారు. కానీ తమను నామినేషన్లు వేయనీకుండా అడ్డుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిన్న అన్నదాతలపై ఇంటెలిజెన్స్ బ్యూరోను రంగంలోకి దింపినట్టు వారు ఆరోపిస్తున్నారు.
రైతులు బస చేసిన సిల్క్ లాడ్జిపై దాడి చేసిన ఐబీ, వారికి అడుగడుగునా చుక్కలు చూపించిందట. ఈ నేపథ్యంలో మీడియా, లాయర్ల సహకారంతో తాము నామినేషన్లు వేసి తీరుతామని రైతులు ప్రకటించారు. కానీ నేడు కూడా వారికి అవాంతరాలు ఎదురయ్యాయి.