Ram Gopal Varma: వర్మకు పిచ్చి పట్టిందేమో అనుకుంటున్నారు: ‘స్పెషల్’ దర్శకుడు వాస్తవ్
- ‘టెర్మినేటర్’ వంటి చిత్రాలు తీస్తారనుకున్నాం
- నాసిరకం చిత్రాలు చూస్తుంటే కోపం వస్తోంది
- వర్మ అభిమానిగా ‘స్పెషల్’ చిత్రాన్ని తీశా
- ‘శివ’ లాంటి చిత్రాన్ని తీశావంటే నమ్మలేకపోతున్నాం
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ‘స్పెషల్’ సినిమా దర్శకుడు వాస్తవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోషల్ మీడియా వేదికగా వర్మను ఆయన టార్గెట్ చేశారు. అప్పట్లో వర్మ చేసిన చిత్రాలు చూసి ఆయన 20 ఏళ్ల తరువాత ‘టెర్మినేటర్’ వంటి గొప్ప సినిమాలు తీస్తారని అనుకున్నామని కానీ వర్మ తీస్తున్న నాసిరకం చిత్రాలు చూస్తుంటే కోపం వస్తోందన్నారు.
‘‘ది గ్రేట్ రామ్గోపాల్ వర్మ కెరీర్ ప్రారంభంలో ‘శివ’, ‘క్షణ క్షణం’లాంటి అద్భుతమైన చిత్రాలు తీసి యువత దర్శకత్వంవైపు రావటానికి మార్గం వేసిన గురువు. దర్శకుడు శంకర్ తన కెరీర్లో ‘జెంటిల్మెన్’ లాంటి చిత్రం తీసి శభాష్ అనిపించుకున్నారు. అప్పట్లో వర్మ చేసిన చిత్రాలు చూసి, ఆయన 20 సంవత్సరాల తర్వాత ‘టెర్మినేటర్’ లాంటి గొప్ప చిత్రాలు తీస్తారు, శంకర్ మంచి చిత్రాలు తీస్తారు అనుకున్నారు. కానీ ఇప్పుడు వర్మ తీస్తున్న నాసిరకం చిత్రాలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘ఐస్క్రీమ్’ చూస్తుంటే అభిమానులకు కోపం వస్తోంది. శంకర్ అత్యాధునిక సాంకేతికతతో ‘రోబో’లాంటి చిత్రాలు తీస్తున్నారు.
వర్మ చెప్పేదంతా సొల్లు. చాలా మంది అతనికి పిచ్చి పట్టిందేమో అనుకుంటున్నారు. ఆయన అభిమానిగా నేను ‘స్పెషల్’ చిత్రాన్ని తీశా. ఒక్కసారి నా సినిమా చూసి అప్పుడు మాట్లాడండి వర్మ. ఇటీవల మద్యం తాగి ఎవరో రాసిచ్చిన పాటని పాడి వర్మ సోషల్ మీడియాలో పెట్టారు. ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్న నువ్వు ‘శివ’ లాంటి గొప్ప చిత్రాన్ని తీశావంటే నమ్మలేకపోతున్నాం. నీలాంటి వ్యక్తిని నమ్మి నిర్మాతలు, నటీనటులు మోసపోతున్నారు’’ అని వాస్తవ్ సోషల్ మీడియాలో వర్మపై ధ్వజమెత్తారు.