goa: పారికర్ కుమారుడికి బీజేపీ షాక్.. ఉప ఎన్నికల్లో దక్కని టికెట్!
- పనాజీ నుంచి టికెట్ ఆశించిన ఉత్పల్ పారికర్
- ఆ స్థానాన్ని సిద్ధార్థ్ కుంకల్యేకర్‌కు కేటాయించిన బీజేపీ
- పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న ఉత్పల్
ఇటీవల మృతి చెందిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్‌కు బీజేపీ అధిష్ఠానం షాకిచ్చింది. పారికర్ మృతితో ఆయన ప్రాతినిధ్యం వహించిన పనాజీ స్థానానికి వచ్చే నెల 19న ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి పారికర్ కుమారుడిని బీజేపీ బరిలోకి దింపుతుందని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా ఆ స్థానాన్ని సిద్ధార్థ్ కుంకల్యేకర్‌కు కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
సిద్ధార్థ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రక్షణ మంత్రిగా ఉన్న పారికర్, గోవా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కోసం సిద్ధార్థ్ తప్పుకున్నారు. దీంతో ఇప్పుడా స్థానాన్ని తిరిగి ఆయనకే కేటాయిస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. కాగా, తనకు టికెట్ కేటాయించకపోవడంపై ఉత్పల్ పారికర్ మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. అధిష్ఠానం తనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. కుంకల్యేకర్ గెలుపు కోసం నియోజకవర్గంలో ప్రచారం కూడా చేస్తానన్నారు.