Lok Sabha elections: ఓటు వేసేందుకు వైద్యుడి సాహసం.. సైకిలుపై 80 కిలోమీటర్లు ప్రయాణించి ఓటేసిన కార్డియాలజిస్ట్!
- సైకిలుపై నాలుగు గంటలు ప్రయాణించిన వైద్యుడు
- సైకిలు తొక్కడం వల్ల గుండెకు బోల్డంత ఆరోగ్యమన్న కార్డియాలజిస్ట్
- ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకే సైకిలుపై వచ్చినట్టు వెల్లడి
ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓ వైద్యుడు సాహసం చేశాడు. సైకిలుపై ఏకంగా 80 కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఓటేశాడు. రాజస్థాన్‌లో జరిగిందీ ఘటన. జైపూర్‌కు చెందిన కార్డియాలజిస్ట్ జీఎల్ శర్మ టోంక్ జిల్లాలోని సోడా గ్రామ నివాసి. జైపూర్‌లో ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా సోమవారం జైపూర్‌లో పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో తన గ్రామానికి వెళ్లి ఓటు వేసేందుకు శర్మ జైపూర్ నుంచి సైకిలుపై తన గ్రామానికి బయలుదేరాడు.
నాలుగు గంటలపాటు ఏకధాటిగా సైకిలు తొక్కుతూ చివరికి గ్రామానికి చేరుకుని ఓటేశాడు. ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం కలిగించడంతోపాటు సైకిలు తొక్కడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెప్పడమే తన ఉద్దేశమని, అందుకనే సైకిలుపై గ్రామానికి వచ్చి ఓటేసినట్టు శర్మ వివరించాడు. ప్రతి ఆదివారం తాను సైకిలు తొక్కుతానని, గుండెకు అది మంచిదని ఆయన వివరించాడు.