air india: పాకిస్థాన్ కారణంగా రూ. 300 కోట్లకు పైగా నష్టపోయిన ఎయిర్ ఇండియా
- తమ గగనతలంపై భారత విమానాల రాకపోకలను నిషేధించిన పాక్
- రోజుకు రూ. 6 కోట్ల మేర నష్టపోతున్న ఎయిర్ ఇండియా
- నష్టపరిహారం కోసం పౌర విమానయాన శాఖను ఆశ్రయించినట్టు సమాచారం
పాకిస్థాన్ లోని బాలాకోట్ ఉగ్రస్ధావరాలపై భారత వాయుసేన దాడి చేసిన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమ గగనతలంపై భారత విమానాల రాకపోకలను పాక్ నిషేధించింది. దీంతో, అమెరికా, యూరప్ వైపు వెళ్లేందుకు పాక్ గగనతలం మీదుగా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను భారత్ వెతుక్కోవాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయ మార్గాల వల్ల ప్రయాణ దూరం పెరగడమే కాకుండా, సిబ్బంది వినియోగం కూడా పెరిగింది. దీంతో, ప్రతి రోజు రూ. 6 కోట్ల చొప్పున ఎయిర్ ఇండియా నష్టపోతోంది. ఇప్పటి వరకు రూ. 300 కోట్లకు పైగా నష్టపోయినట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో, పౌర విమానయాన శాఖను ఆశ్రయించి, నష్టపరిహారాన్ని కోరినట్టు సమాచారం.