congress: గురుతర బాధ్యత ఉన్నందునే వారణాసి నుంచి పోటీకి దూరం: క్లారిటీ ఇచ్చిన ప్రియాంక వాద్రా
- నేను యూపీలో తూర్పు భాగం ఇన్చార్జిని
- అక్కడి 41 మంది అభ్యర్థుల గెలుపు బాధ్యత నాది
- నా గెలుపుకోసం చూస్తే ఇక్కడి వారి అవకాశాలు దెబ్బతింటాయి
'నేను గెలవడం కంటే నా వాళ్లను గెలిపించుకోవాల్సిన గురుతర బాధ్యత నాపై ఉన్నందునే, నేను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతం వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆలోచన నుంచి విరమించుకున్నా'నని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంక వాద్రా క్లారిటీ ఇచ్చారు.
పార్టీలోని సీనియర్లను సంప్రదించిన తర్వాత, పార్టీ ఆదేశాల మేరకే తానీ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మక వారణాసి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని మోదీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు ప్రత్యర్థిగా ఈసారి ప్రియాంకను రంగంలోకి దించాలని కాంగ్రెస్ యోచిస్తోందన్న వార్తలు వచ్చాయి. అదేమీ జరగక పోవడంతో ప్రధానిపై పోటీ విషయంలో కాంగ్రెస్ వెనుకడుగు వేసిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ప్రియాంక ఈ విధంగా సమాధానమిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు భాగం మొత్తానికి తాను ఇన్చార్జినని, అక్కడ పోటీ చేస్తున్న 41 మంది ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. వీరితోపాటు చాలామంది ఇతర అభ్యర్థుల నియోజకవర్గాల్లోను ప్రచారం చేయాల్సి ఉందని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో తన నియోజకవర్గంలో గెలుపుకోసం తాను ప్రయత్నిస్తూ, మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు అవకాశాలను చేజార్చు కోవడం సరైన కాదని భావించానన్నారు. అందుకే పార్టీలోని సీనియర్లందరితో చర్చించి వారి సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని 41 మంది అభ్యర్థులను గెలిపించుకోవడమే తన ముందున్న ప్రధాన బాధ్యతని స్పష్టం చేశారు.