India: బెంగాల్ కు కొత్త చీఫ్ ను ప్రకటించిన ఐఎస్... భీకర దాడులు తప్పవట!
- అమీర్ గా అబూ ముహమ్మద్ అల్ బెంగాలీ
- మా సైనికులు నిశ్శబ్ధంగా ఉన్నారని అనుకోవద్దు
- పలు భాషల్లో పోస్టర్ విడుదల
బెంగాల్ లో తమ అమీర్ గా అబూ ముహమ్మద్ అల్ బెంగాలీని నియమించామని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఇండియా, బంగ్లాదేశ్ లలో అబూ మహమ్మద్ ఆధ్వర్యంలో భీకర దాడులు జరుగుతాయని హెచ్చరించింది. "బెంగాల్, హింద్ ప్రాంతాల్లో మా సైనికులు నిశ్శబ్దంగా ఉన్నారని మీరు అనుకోవచ్చు. కానీ వారు ఎప్పుడూ అలా ఉండరు. ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు" అంటూ బెంగాలీ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఐఎస్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.
కాగా, ఢాకాలోని ఓ సినిమా హాల్ వద్ద తేలికపాటి పేలుడుకు ఉగ్రవాదులు పాల్పడిన గంటల వ్యవధిలో ఈ ప్రకటన విడుదల కావడం గమనార్హం. ఢాకాలోని గులిస్థాన్ థియేటర్ సమీపంలో సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఈ పేలుడు జరుగగా, ప్రాణనష్టం సంభవించలేదు. కొందరు పోలీసులకు మాత్రం గాయాలు అయ్యాయి. ఆపై మంగళవారం నాడు తమ పత్రిక అమాక్ ద్వారా ఐఎస్ ఓ ప్రకటన చేసింది. దానికి బెంగాలీ అనువాదాన్ని కూడా జతచేసింది. ఇక ఐఎస్ విడుదల చేసిన ప్రకటన వెనుక ఎవరున్నారన్న విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పరిశీలిస్తున్నాయి. అబూ మహమ్మద్ ఎవరో కనిపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.