Telangana: 150 కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణం.. యాదాద్రి జిల్లాలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం!
- తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
- నిన్న రాత్రి పార్టీ చేసుకున్నాక తిరుగు ప్రయాణం
- మృతుల్లో ఇద్దరు యువతులు
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫేర్ వెల్ పార్టీ అనంతరం కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంటికి తిరిగి వెళుతుండగా కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువతులు సహా నలుగురు బీటెక్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారు గంటకు 120-150 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇబ్రహీంపట్నంలోని శ్రీహిందూ ఇంజనీరింగ్ కాలేజీలో చైతన్య, ప్రణతి, స్ఫూర్తి, వినీత్, మరో విద్యార్థి చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరు నిన్న శ్రీ బృందావన్ ఫామ్ హౌస్ లో ఫేర్ వెల్ పార్టీలో పాల్గొన్నారు. అనంతరం ఈరోజు ఉదయం తిరిగి ఇళ్లకు వెళ్లే క్రమంలో తమ కారులో వేగంగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో కారు బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి వద్దకు రాగానే అదుపు తప్పి పక్కనే ఉన్న పొలంలోకి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో చైతన్య, ప్రణతి, స్ఫూర్తి, వినీత్ తీవ్రంగా గాయపడ్డారు.
కారు శబ్దం విన్న గ్రామస్తులు పరుగుపరుగున అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో ముగ్గురు ఘటనాస్థలంలోనే చనిపోగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్మరణం చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో విద్యార్థి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.
కాగా, ఈ కారులో పలు మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. మద్యం మత్తులో కారును నడపడంతోనే కారు అదుపు తప్పి ప్రమాదం జరిగిఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.