KXIP: ఇక 'కింగ్స్ ఎలెవన్ పంజాబ్' పేరు వినిపించదా?... టీమ్ రద్దయ్యే అవకాశం!
- సహ యజమాని నెస్ వాడియాకు జైలు శిక్ష
- గతంలో ఆరోపణలు వచ్చినందుకే సీఎస్కే సస్పెన్షన్
- యజమానే దోషిగా తేలడంతో జట్టు రద్దు యోచన!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పంజాబ్ ఫ్రాంచైజీగా ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై సస్పెన్షన్ వేటు పడనుందా? బీసీసీఐ నిబంధనలు అవుననే చెబుతున్నాయి. ఫ్రాంచైజీ సహ యజమాని నెస్ వాడియాకు జపాన్ న్యాయస్థానం రెండు సంవత్సరాల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. వాడియా డ్రగ్స్ తో పట్టుబడగా, విచారించిన కోర్టు జైలు శిక్షను విధిస్తూ, శిక్ష అమలును ఐదేళ్లు సస్పెన్షన్ లో ఉంచిన సంగతి తెలిసిందే.
ఇక ఐపీఎల్ నిర్వహణా నిబంధనల ప్రకారం, ఏ టీమ్ అధికారి కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి జైలు శిక్షకు గురైతే, సదరు టీమ్ ను సస్పెండ్ చేయవచ్చు. ఈ కారణంతో కింగ్స్ ఎలెవన్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడినట్టేనని, టీమ్ సస్పెండ్ పై నిపుణుల కమిటీ, అంబుడ్స్ మన్ నిర్ణయిస్తాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
గతంలో చెన్నై సూపర్ కింగ్స్ అధికారిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలు రాగా, ఆ టీమ్ రెండేళ్ల పాటు సస్పెన్షన్ కు గురైన సంగతిని గుర్తు చేసిన ఆయన, యజమానికే శిక్ష పడటంతో సస్పెన్షన్ తప్పక పోవచ్చని, అసలు టీమ్ ను పూర్తిగా రద్దు చేసే చాన్స్ కూడా ఉందని అన్నారు. చెన్నై విషయంలో టీమ్ అధికారిపై మాత్రమే బెట్టింగ్ ఆరోపణలు వచ్చాయని, కేఎక్స్ ఐపీ విషయంలో యాజమాన్యమే దోషిగా తేలిందని ఆయన అన్నారు.