somireddy: తుపాను ముంచుకొస్తున్న సమయంలో... ఏం చేయాలో అధికారులకు అర్థం కావడం లేదు: సోమిరెడ్డి
- విపత్తుల సమయంలో కూడా ప్రభుత్వాన్ని ఈసీ పని చేయనీయడం లేదు
- ఎవరి మాట వినాలో అధికారులకు అర్థం కావడం లేదు
- ప్రభుత్వం సాధారణ పాలన చేయవచ్చు
ఏపీ ప్రభుత్వం పట్ల ఈసీ వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తుపానుల వంటి ప్రకృతి విపత్తులు సంభవించే సమయంలో కూడా ప్రభుత్వాన్ని పని చేయనీయడం లేదని అన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వానికి ఈసీ అనుమతినివ్వాలని చెప్పారు. కరవు, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వం సమీక్షలు చేయవచ్చని అన్నారు. ఓ వైపు తుపాను ముంచుకొస్తున్న తరుణంలో, ఏం చేయాలో అధికారులకు అర్థం కాని పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వం, ఈసీల్లో ఎవరి మాట వినాలో తోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. సాగు పద్ధతులపై రైతులకు దిశానిర్దేశం చేయాల్సి ఉందని... సమీక్ష నిర్వహించాల్సి ఉందని అన్నారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం సాధారణ పాలన చేయవచ్చని చెప్పారు.