Crime News: మంచి చెబితే మరణ శాసనం రాశాడు.. తండ్రిని చంపిన తనయుడు!
- రోకలి బండతో కొట్టి హత్య
- అనంతరం సోదరుడితో కలిసి పెట్రోల్ పోసి నిప్పు
- సగం కాలిన మృతదేహం లభించడంతో గుట్టురట్టు
చెడు తిరుగుళ్లు మానేసి జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చెల్లి జీవితాన్ని తప్పుడు నిర్ణయంతో పాడు చేయొద్దని చెప్పిన తండ్రి మాటలు అతనికి రుచించలేదు. తన మాట కాదంటున్నాడన్న కక్షతో చంపేశాడు. అనంతరం శవాన్ని కాల్చి బూడిద చేసే ప్రయత్నం ఫలించక పోవడంతో గుట్టు రట్టయింది.
ఆ వివరాలలోకి వెళితే.. హైదరాబాద్‌లోని నిజాంపేట (బాచుపల్లి రాజీవ్‌గాంధీనగర్)లో మహ్మద్ మస్తాన్ (52) టెంట్ హౌస్ నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఇతనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్దకొడుకు ఫిరోజ్ (22) జులాయిగా తిరుగుతుండడంతో తరచూ మందలించేవాడు. పైగా తన స్నేహితుడైన సలీంకు తన సోదరినిచ్చి పెళ్లి చేయాలని ఫిరోజ్ ఒత్తిడి చేస్తుండడం కూడా నచ్చని మస్తాన్ కొడుకు మాటలను పట్టించుకునే వాడు కాదు.
దీంతో తండ్రిపై కక్ష పెంచుకున్న ఫిరోజ్ అతన్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితుడు సలీంతో కలిసి ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో మస్తాన్ ను రోకలి బండతో కొట్టి చంపేశాడు. అనంతరం ‘ఆవేశంలో మామూలుగా కొట్టడంతో నాన్న చనిపోయాడు’ అంటూ సోదరుడు అప్రోజ్‌ను నమ్మించడంతో ముగ్గురూ కలిసి శవాన్ని కారులో వేసుకుని కోహీర్ మండం పైడిగుమ్మల్ శివారుకు తెచ్చారు.
గుంతలో మృతదేహాన్ని పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించి అనంతరం వెళ్లిపోయారు. మరుసటి రోజు పూర్తిగా కాలని శవాన్ని గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ మొదలు పెట్టారు. అదే రోజు తన భర్త కనిపించడం లేదంటూ మస్తాన్ భార్య కూడా ఫిర్యాదు చేయడంతో రెండు కేసుల్ని జోడించి విచారణ మొదలు పెట్టారు. తీగ లాగడంతో డొంకంతా కదిలి కొడుకుల నిర్వాకం బయటపడింది.