Andhra Pradesh: జగన్ కు చివరికి సీఎం అన్న నేమ్ ప్లేట్ మాత్రమే మిగులుతుంది!: దేవినేని ఉమ సెటైర్లు
- వైఎస్ వల్లే కృష్ణా హక్కులను కోల్పోయాం
- ఆల్మట్టిపై ఐదేళ్లుగా పోరాడుతున్నాం
- అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
వైసీపీ అధినేత జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కారణంగానే కృష్ణా నదిపై ఏపీ నీటి హక్కును కోల్పోవాల్సి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. దీనివల్ల ఏపీ 448 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం పోగొట్టుకుందనీ, లేదంటే ఇంత సామర్థ్యంలో ప్రాజెక్టులు కట్టుకునేవాళ్లమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ గేట్ల ఎత్తు పెంపుపై ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రాష్ట్ర హక్కుల కోసం సుప్రీంకోర్టులో కేసులు వేసిందనీ, పోరాడిందని ఉమ గుర్తుచేశారు. ఏపీలో సాగునీటి రంగం, జలవనరుల విషయంలో వైసీపీ అధినేత జగన్ కు కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రాబోయే వారం రోజుల్లో పట్టిసీమ నుంచి గోదావరి జలాలను తరలిస్తామని తెలిపారు.
వైసీపీ అధినేత జగన్ కు చివరికి సీఎం అన్న నేమ్ ప్లేట్ మాత్రమే మిగులుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ కు సహకరించిన అధికారులు, నేతలంతా జైలుకు వెళతారని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి ఓ డర్టీ మ్యాన్ అని వ్యాఖ్యానించారు. జగన్, విజయసాయిరెడ్డిలు అవినీతి బురదలో కూరుకుపోయిన మురికి వ్యక్తులని విమర్శించారు.