Andhra Pradesh: చంద్రబాబు పాలన హుద్ హుద్ తో మొదలైంది.. ఫణి తుపానుతో ముగిసిపోతుంది!: వైసీపీ నేత కాకాణి జోస్యం
- ఇన్నాళ్లూ సోమిరెడ్డి రైతులను పట్టించుకోలేదు
- ఇప్పుడు సమీక్షల పేరుతో హడావుడి చేస్తున్నారు
- ఆయనకు వ్యవసాయం గురించి అవగాహనే లేదు
- హైదరాబాద్ లో మీడియాతో వైసీపీ నెల్లూరు నేత
చంద్రబాబు పాలన హుద్ హుద్ తుపానుతో మొదలై ఫణి తుపానుతో ముగుస్తుందని వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. అధికారంలో ఉన్నంతకాలం రైతులను పట్టించుకోని సోమిరెడ్డి ఇప్పుడు వారి గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు అసలు వ్యవసాయంపై, ఏ విషయంలో సమీక్షలు జరపాలన్న విషయమై కనీస అవగాహన లేదని దుయ్యబట్టారు.
యాక్షన్ ప్లాన్ లేకుండా ఖరీఫ్ సీజన్ పై సమీక్ష చేస్తానని సోమిరెడ్డి చెప్పడం సిగ్గుచేటు విషయమన్నారు. హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు.
అసలు సోమిరెడ్డిని సోంబేరి రెడ్డి అని పిలవాలని ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇందుకోసం సోమిరెడ్డి మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకున్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామన్న బాబు.. సోమిరెడ్డి కోసమే ఆ సిఫార్సులను గాలికి వదిలేశారు.
నాబార్డ్ సర్వేలో అవినీతిలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత సోమిరెడ్డిదే. అసమర్థుడైన వ్యవసాయశాఖ మంత్రిగా సోమిరెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు’ అని విమర్శల వర్షం కురిపించారు. సోమిరెడ్డి ఓ కిరాయి మంత్రి అని దుయ్యబట్టారు. రెండేళ్ల పాటు వ్యవసాయశాఖ మంత్రిగా సోమిరెడ్డి ఏం చేశారో చెప్పాలని కాకాణి డిమాండ్ చేశారు.