manmohan singh: దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది: మన్మోహన్ సింగ్
- పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు తెగబడుతూనే వున్నాయి
- జమ్మూ కశ్మీర్ లో అంతర్గత భద్రత క్షీణించింది
- దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదు
దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల పట్ల మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశ వ్యతిరేక శక్తులపై నిఘా విషయంలోను, జాతీయ భద్రత విషయంలోను ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత ఐదేళ్లుగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు భారత్ లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతూనే వున్నాయనీ, జమ్మూ కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్ పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
ఈ ఐదేళ్లలో జమ్మూ కశ్మీర్ అంతర్గత భద్రత చాలావరకూ క్షీణించిందనీ, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ దగ్గర ఉగ్రదాడి జరిగినప్పుడు కూడా మోదీ ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించలేదని అన్నారు. దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదని చెబుతూ, మోదీ ప్రభుత్వం దేశ రక్షణ విషయంలో పూర్తిగా విఫలమైందనే అభిప్రాయన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన దేశ ఆర్ధిక వృద్ధి కూడా బలహీనపడిందనీ, ఆ పరిస్థితిని మెరుగు పరచడానికి, రాహుల్ ప్రకటించిన 'న్యాయ్' పథకం ఉపయోగపడుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, జీఎస్టీని సరళీకరించాలని అనుకుంటోందని ఆయన చెప్పుకొచ్చారు.