Andhra Pradesh: తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాం: చంద్రబాబు
- ఐఎండీ కన్నా ఆర్టీజీఎస్ సమర్థంగా పని చేసింది
- గతంలో తుపాన్ వస్తే ఎవరూ పట్టించుకునేవారు కాదు
- ఈరోజు సాయంత్రానికి సహాయక చర్యలు పూర్తవుతాయి
‘ఫణి’ తుపాన్ ప్రభావానికి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని, పక్కా ప్రణాళికతో ముందుకెళ్లామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి ఆయన మాట్లాడుతూ, ‘ఫణి’కి సంబంధించి ఆర్టీజీఎస్ ఇచ్చిన సమాచారంపై ఒడిశా ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఐఎండీ కన్నా ఆర్టీజీఎస్ సమర్థంగా పని చేసిందని అన్నారు. గతంలో తుపాన్ వస్తే ఎవరూ పట్టించుకునేవారు కాదని, ఇప్పుడు తుపాన్ వస్తే ప్రతిక్షణం సహాయ చర్యలు అందిస్తున్నామని అన్నారు. గత తుపాన్ల అనుభవంతో ‘ఫణి’పై ప్రణాళికతో వ్యవహరించామని చెప్పారు.
ఒడిశాలోని పూరీ వద్ద తుపాన్ తీరం దాటుతుందని ఆర్టీజీఎస్ కచ్చితంగా అంచనా వేసిందని, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోపై తుపాన్ ప్రభావం ఉంటుందని ముందే చెప్పామని అన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని, కవిటి, మందస, ఇచ్చాపురంలో ఈదురుగాలులు, వర్షాలు కురిశాయని చెప్పారు. మొత్తం 14 మండలాలు తుపాన్ ప్రభావానికి గురయ్యాయని, 9 మండలాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పామని, ఆయా మండలాల్లో సహాయచర్యలు ముమ్మరం చేశామని, ఈరోజు సాయంత్రం వరకూ సహాయక చర్యలు కొనసాగుతాయని అన్నారు.
ఇచ్ఛాపురంలో ఒక్క రోజులో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, 733 గ్రామాలు తుపాను వల్ల ప్రభావితమయ్యాయని, ఇప్పటి వరకూ వచ్చిన అంచనా ప్రకారం రాష్ట్రంలో రూ.10 కోట్ల మేరకు తుపాన్ నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు. తుపాన్ కారణంగా టెలిఫోన్ సిగ్నల్స్ బ్రేక్ అవ్వకుండా చూడగలిగామని, లక్ష 14 వేల మందికి ఆహారం అందించామని, ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని అన్నారు. తుపాన్ పర్యవేక్షణకు ఈసీ అడ్డుపడిందని, తుపాన్ తీరం దాటాక రివ్యూలకు అనుమతి ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు.