Odisha: ముగ్గుర్ని బలిగొన్న ఫణి... తుపాను ప్రభావిత రాష్ట్రాలకు రూ.1000 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- ఒడిశాలో పరిస్థితి భీతావహం
- నేలకూలిన వృక్షాలు, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
- ఆదుకుంటామంటూ మోదీ ప్రకటన
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర పెనుతుపాను ఈ ఉదయం ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటడంతో అపార నష్టం వాటిల్లింది. ఒడిశా తీరం ఈ ప్రకృతి విపత్తు కారణంగా అల్లల్లాడిపోయింది. కాగా, ఫణి తుపానుతో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. పూరీలో చెట్టు కూలిన ఘటనలో ఓ టీనేజ్ యువకుడు, నిర్మాణంలో ఉన్న భవనం నుంచి ఎగిరివచ్చిన వస్తువు తగిలి నయాగఢ్ జిల్లాలో ఓ మహిళ, కేంద్రపారాలో తుపాను రక్షణ కేంద్రంలో ఆశ్రయం పొందుతూ 65 మహిళ గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది.
పూరీ మొదలుకుని భువనేశ్వర్ వరకు ఎక్కడ చూసినా ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాలు, వేళ్లతో సహా పెకలించుకువచ్చిన వృక్షాలు, కూలిపోయిన ఇళ్లతో భీతావహ వాతావరణం కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు తోడు స్థానిక సహాయక బృందాలు కూడా సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.
ఈ నేపథ్యంలో, తుపాను ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం నుంచి రూ.1000 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఫణి కారణంగా నష్టపోయిన రాష్ట్రాలను ఆదుకుంటామని పేర్కొన్నారు.
గత 20 ఏళ్లలో ఎన్నడూలేనంత తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఫణి తుపాను క్రమంగా బలహీనపడుతూ పశ్చిమ బెంగాల్ దిశగా పయనిస్తోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్గాలు చెబుతున్నాయి. ఒడిశాలో 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారంటే ఫణి ఏ స్థాయికి చెందిన తుపానో అర్థమవుతోంది. 100కి పైగా రైళ్లు, 200కి పైగా విమానాలను కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.