Telangana: రూ.10 లక్షల లంచం వ్యవహారం.. తెలంగాణలో ఎంపీటీసీ ఎన్నికను రద్దుచేసిన ఈసీ!
- నాగర్ కర్నూలు జిల్లాలోని గగ్గళ్లపల్లిలో ఘటన
- పోటీ నుంచి తప్పుకునేందుకు నగదు ఆఫర్
- కాంగ్రెస్ నేతకు 10 లక్షలు ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి
తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని గగ్గళ్లపల్లి ఎంపీటీసీ స్థానం ఎన్నికను రద్దు చేసింది. ఇక్కడి పదవిని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి తన ప్రత్యర్థి కాంగ్రెస్ నేతకు రూ.10 లక్షలు అందించినట్లు తేలడంతో ఈసీ ఈ మేరకు స్పందించింది. త్వరలోనే ఇక్కడ మరోసారి ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
గగ్గళ్లపల్లి ఎంపీటీసీ స్థానానికి రేపు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల ఈశ్వరరెడ్డి తనకు బలవంతంగా రూ.10 లక్షలు ఇచ్చి తన నామినేషన్ను ఉపసంహరించుకునేలా చేశారంటూ కాంగ్రెస్ అభ్యర్థి దొడ్ల వెంకటనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో విచారణ కోసం ఈసీ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల పరిశీలకుడితో త్రిసభ్య కమిటీని నియమించింది. విచారణ జరిపిన కమిటీ రూ.10 లక్షలు చేతులు మారిన విషయం నిజమేనని నిర్ధారించింది. దీన్ని పరిశీలించిన తెలంగాణ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఎన్నికలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.