Pakistan: టిప్పు సుల్తాన్ కు నివాళులు అర్పించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- ఆయన నా ఆరాధ్య పాలకుడు
- బానిసత్వం కంటే వీరమరణమే నయమనుకున్నారు
- ట్వీట్ చేసిన ఇమ్రాన్
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో ఓ భారతీయ పరిపాలకుడికి నివాళులు అర్పించారు. 18వ శతాబ్దంలో మైసూర్ నుంచి దక్షిణభారతాన్ని ఏలిన టిప్పు సుల్తాన్ కు ఇమ్రాన్ ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. బానిసగా పరాయి పాలనలో బతకడం కంటే స్వాతంత్ర్యం కోసం చచ్చిపోయినా ఫర్వాలేదని భావించిన మహనీయుడు టిప్పు సుల్తాన్ అని ఇమ్రాన్ తన ట్వీట్ లో కొనియాడారు. మే4న టిప్పుసుల్తాన్ వర్థంతి, ఆయనను నేనెంతో ఆరాధిస్తాను అంటూ శనివారం నాటి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
టిప్పు సుల్తాన్ గురించి పాక్ ప్రధాని మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం జరిగిన పార్లమెంటరీ సంయుక్త సమావేశంలో కూడా ఆయన టిప్పు సుల్తాన్ గురించి ప్రస్తావించారు. ఆంగ్లేయులతో జరిగిన యుద్ధంలో శ్రీరంగపట్నం వద్ద టిప్పు వీరమరణం పొందారు.
అయితే, పారిపోవడానికి తాము సహకరిస్తామంటూ ఫ్రెంచి వలస పాలకులు ప్రతిపాదన చేసినా టిప్పు నిరాకరించారు. వెయ్యేళ్లు ఓ పిరికి గొర్రెలా బతకడం కంటే ఒక్కరోజు పులిలా బతికినా చాలు అంటూ ధైర్యంగా యుద్ధాన్ని కొనసాగించారు. ఈ మాటలనే ఇమ్రాన్ ఖాన్ పుల్వామా దాడి అనంతరం స్మరించుకున్నారు.