Andhra Pradesh: ఏపీలో ఐదు చోట్ల ప్రారంభమైన రీపోలింగ్.. భారీ బందోబస్తు
- ఉదయం నుంచే ఓటర్ల బారులు
- పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
- ఆరు గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు నియోజకవర్గాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐదో దశ ఎన్నికలతో పాటు ఇక్కడ రీపోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం, కేసానుపల్లి గ్రామంలోని 94వ నంబరు పోలింగ్ బూత్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, నల్లచెరువులోని 244వ నంబరు బూత్, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం, కలనూతల గ్రామంలోని 247వ నంబరు పోలింగ్ బూత్‌లలో అసెంబ్లీ, పార్లమెంట్లకు, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కోవూరు నియోజకవర్గం పల్లెపాలెంలోని ఇసుకపల్లిలో 41వ నంబరు పోలింగ్ బూత్‌లో పార్లమెంట్‌కు, తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఆటకానితిప్ప గ్రామంలోని 197వ నంబరు పోలింగ్ బూత్‌లో పార్లమెంట్ స్థానాలకు రీపోలింగ్ ప్రారంభమైంది.
తొలి విడతలో ఎన్నికల్లో జరిగిన హింసను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, ఏపీలో ఎండలు మండిపోతుండడంతో ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని బారులు తీరారు.