Summer: తెలుగు రాష్ట్రాలపై నిప్పులు కురిపిస్తున్న భానుడు.. అల్లాడిపోతున్న ప్రజలు

  • సాధారణం కంటే ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత
  • బలంగా వీస్తున్న వడగాలులు
  • బయటకు రావొద్దంటున్న అధికారులు

తెలుగు రాష్ట్రాలపై భానుడు పగబట్టినట్టు ఉన్నాడు. నిప్పులు కురిపిస్తూ ప్రజలను అల్లాడిస్తున్నాడు. ఫణి తుపాను అటు వెళ్లిందో లేదో, ఇటు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోడ్లు నిప్పుల కొలిమిలా మారుతుంటే వడగాలులు ముఖంపై చాచికొడుతున్నాయి. భానుడి ప్రకోపానికి ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

నిజానికి ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వేసవిలో ఉష్ణోగ్రతల్లో కొంత వ్యత్యాసం ఉంటుంది. అయితే, ఈసారి మాత్రం అటువంటి తేడాలు ఏమీ కనిపించడం లేదు.  కోస్తా, రాయలసీమ అనే తేడా లేకుండా భానుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. ఉదయం ఏడు గంటలకే ప్రారంభమవుతున్న వేడిమి సాయంత్రమైనా తగ్గుముఖం పట్టడం లేదు.  ఆదివారం కృష్ణా, గుంటూరుతోపాటు ఉభయగోదావరి, నెల్లూరు జిల్లాల్లో వడగాలులు ప్రజలను ఇక్కట్లకు గురిచేశాయి. తెలంగాణలోనూ భానుడి ప్రతాపం కొనసాగుతోంది.

రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఆదివారం సాధారణం కంటే  5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. అనేక ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పోలవరంలో రెండు రోజులుగా 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం పది గంటల నుంచి ఎండ ప్రభావం తగ్గేవరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని  వాతావరణ శాఖ అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News