Andhra Pradesh: పసుపు కండువాతో పోలింగ్ కేంద్రంలోకి గల్లా జయదేవ్.. అభ్యంతరం వ్యక్తంచేసిన వైసీపీ!
- గుంటూరు వెస్ట్ లోని నల్లచెరువులో ఘటన
- పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన గల్లా
- అభ్యంతరం వ్యక్తంచేసిన వైసీపీ ఏజెంట్ సుధాకర్
ఆంధ్రప్రదేశ్ లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జోరుగా సాగుతోంది. ప్రజలంతా క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ నేత, లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ ఈరోజు ఎన్నికల సందర్భంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని నల్లచెరువు బూత్ నంబర్ 244లో పోలింగ్ సరళిని పరిశీలించారు.
అయితే గల్లా జయదేవ్ పసుపు కండువాతో రావడంపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని సూచించారు. అయితే వాటిని పట్టించుకోని గల్లా జయదేవ్, పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చెలరేగింది.