Russia: ఒక తెల్లటి కాంతిని చూశాను... ఆ తర్వాత విమానం మంటల్లో చిక్కుకోవడం చూశాను: ప్రమాదానికి గురైన రష్యా విమాన పైలట్
- మండుతున్న అగ్నిగోళంలా ఉంది
- కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయలేదు
- ఇంధన ట్యాంకు బద్దలైందనుకున్నాను
రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో 41 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఏరోఫ్లోట్ విమానయాన సంస్థకు చెందిన సుఖోయ్ సూపర్ జెట్-100 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే అగ్నికీలల్లో చిక్కుకుంది. ఆ విమానం మాస్కోలోని షెరెమెత్యెవో విమానాశ్రయం నుంచి ఆర్కిటిక్ వలయం సమీపంలోని ముర్మాన్స్క్ నగరం వెళ్లాల్సి ఉంది. అయితే, మంటల కారణంగా ఆ విమానాన్ని పైలట్ అత్యవసరంగా కిందికి దించేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
మండిపోతున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుండగా కొందరు వీడియో తీశారు. కాగా, ఈ దుర్ఘటనపై విమాన పైలట్ డెనిస్ యెవ్దోకిమోవ్ రష్యా మీడియాతో మాట్లాడుతూ, టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటి తర్వాత ఓ తెల్లటి కాంతి ఆకాశం నుంచి కిందికి పడుతుండగా చూశానని వెల్లడించాడు. అది మండుతున్న అగ్నిగోళంలా ఉందని, ఆ వెంటనే విమానం మంటల్లో చిక్కుకుందని వివరించాడు. ఆపై కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయడం మానేశాయని తెలిపాడు.
పిడుగు అయ్యుండొచ్చని, అయితే అది నేరుగా విమానాన్ని తాకిందా? లేక దాని ప్రభావం విమానంపై పడిందా? అనేది చెప్పలేనని అన్నాడు. చాలా వరకు విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఇంధన ట్యాంకు కారణంగా మంటలు చెలరేగే అవకాశం ఉందని, తాను కూడా అలాగే భావించానని తెలిపాడు. డెనిస్ మాత్రమే కాదు, పలువురు ప్రయాణికులు సైతం మండుతున్న అగ్నిగోళాన్ని చూశామని చెబుతున్నారు. కాగా, ఈ విమానం బ్లాక్ బాక్స్ లను గుర్తించారు. వాటిని దర్యాప్తు అధికారులకు అప్పగించారు.