Vizag: రేవ్ పార్టీ వెనుక ఎవరున్నా వదిలిపెట్టం: సీపీ మహేశ్ చంద్ర లడ్డా
- ఇలాంటి పార్టీలు నిర్వహించే వారిని మేమెందుకు రక్షిస్తాం?
- వాళ్లను రక్షించాలనుకుంటే దాడి ఎందుకు చేస్తాం!
- రాజకీయ విషయాల జోలికి నేను పోను
విశాఖలో గత నెల 13వ తేదీన రేవ్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో మంత్రి సంబంధీకులు కొంత మంది పాల్గొన్నారని, అందుకే, అసలు నిందితులను వదిలేసి, వేరే వాళ్లను పోలీసులు అరెస్టు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్టణం సీపీ మహేశ్ చంద్ర లడ్డా స్పందించారు.
విశాఖకు కొన్ని వారాలుగా మాదక ద్రవ్యాలు వస్తున్నాయన్న సమాచారంతో ఓ ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి నిఘా ఉంచామని, 13వ తేదీన రేవ్ పార్టీ జరిగితే అక్కడికి వెళ్లి తనిఖీలు చేశామని చెప్పారు. అక్కడ ఎల్సీడీ, కొకైన్ లభించిందని, దీనిపై విచారణ చేస్తే ఐదు లేదా ఆరుగురు పెడ్లర్స్ మాదక ద్రవ్యాలను విశాఖలో విక్రయించేందుకు యత్నిస్తున్నట్టు తెలిసిందని అన్నారు. ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశామని, ఇందులో ఇద్దరు పెడ్లర్స్ ఉన్నారని అన్నారు. ఇంకా, ముగ్గురు లేదా నలుగురు పెడ్లర్స్ తప్పించుకుని తిరుగుతున్నారని చెప్పారు.
డ్రగ్స్ కు అలవాటుపడ్డ వాళ్ల పేర్ల జాబితా తమ వద్ద ఉందని, ఆ జాబితా అన్ని పోలీస్ స్టేషన్లలోని అధికారుల వద్ద ఉన్నట్టు చెప్పారు. డ్రగ్స్ కు అలవాటు పడ్డ వారికి, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించామని, ఫ్రెండ్స్ ద్వారా, పార్టీలకు వెళ్లడం ద్వారా తమకు అలవాటైనట్లు చెప్పారని అన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన ఆరుగురిని విచారించామని, గోవా, హైదరాబాద్, బెంగళూరు నుంచి ఇంటర్నెట్ డార్క్ నెట్ వెబ్ సైట్ ద్వారా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తున్నట్టు తెలిసిందని అన్నారు.
ఈ పార్టీ వెనుక కొందరు రాజకీయనాయకులు, వారి అనుచరుల హస్తం ఉందన్న ఆరోపణలపై లడ్డా స్పందిస్తూ, తమకు ఉన్న సమాచారం మేరకే రేవ్ పార్టీ జరుగుతున్న సమయంలో దాడులు చేశామని అన్నారు. ఇలాంటి పార్టీలు నిర్వహించే వారిని రక్షించాలని తాము చూస్తే, అసలు, దాడి చేసే వాళ్లమే కాదుగా? అన్నారు. రాజకీయ విషయాల జోలికి తాను పోనని, ప్రొఫెషనల్ గా పని చేస్తున్నామని చెప్పారు. రేవ్ పార్టీ వెనుక రాజకీయ నాయకులు లేదా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు ఎవరున్నాసరే సహించమని హెచ్చరించారు.