Andhra Pradesh: చంద్రబాబు ఆరాటం చూస్తుంటే జాలేస్తోంది: జీవీఎల్
- టీడీపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయం
- మంగళగిరిలో లోకేశ్ ఓటమి పాలు కాబోతున్నాడు
- 2024 నాటికి తెలుగు రాష్ట్రాలను బీజేపీకి కంచుకోటగా చేస్తాం
ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మరోసారి విమర్శలు గుప్పించారు. ఏపీలో మార్పు కోసం ప్రజలు ఓటేశారని, టీడీపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమని అన్నారు. అధికారం పోతుందని తెలిసినా కూడా చంద్రబాబు ఆరాటం చూస్తుంటే జాలేస్తోందని వ్యాఖ్యానించారు. మంగళగిరిలో నారా లోకేశ్ ఓటమి పాలు కాబోతున్నాడని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాలను బీజేపీకి కంచుకోటగా చేస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. 2024లో ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ నిర్ణయాత్మకశక్తిగా ఎదుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు, ఈసీపై బాబు విమర్శలు, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రస్తావించారు. కేంద్రం ఇచ్చే నిధులపై తప్ప, దీని నిర్మాణంపై చంద్రబాబుకు శ్రద్ధ లేదని విమర్శించారు. ఈసీని తిట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. కేసీఆర్ ఏర్పాటు చేస్తానంటున్న ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.