Andhra Pradesh: రాబోయే ఐదేళ్లలో పోలవరాన్ని పూర్తిచేయగలిగితే గొప్ప విషయమే!: బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు
- ఈ ఏడాది నీళ్లు ఇవ్వలేమని బాబుకు తెలుసు
- ఎన్నికలు అయ్యేవరకూ అందుకే మౌనంగా ఉన్నారు
- ఏపీ ముఖ్యమంత్రిపై మండిపడ్డ మాజీ సీఎస్
2020, జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి నీళ్లు ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు వ్యంగ్యంగా స్పందించారు.
పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది గ్రావిటీ ఆధారంగా నీళ్లు ఇవ్వలేమన్న విషయం చంద్రబాబుకు ముందే తెలుసని ఐవైఆర్ ఆరోపించారు. అయితే ఈ విషయం బయటకు చెప్పడానికి ఎన్నికలు అయ్యేంత వరకూ ఆగారని ఎద్దేవా చేశారు. ఈరోజు ట్విట్టర్ లో ఐవైఆర్ స్పందిస్తూ..‘ ఈ విషయం ముఖ్యమంత్రి గారికి, అందరికీ తెలుసు. ఎలక్షన్లు అయిందాకా ఆగారు అంతే. విషయ పరిజ్ఞానం ఉన్న ఇంజనీర్ల ప్రకారం రాబోయే 5 సంవత్సరాల్లో అయితే త్వరగా పూర్తయినట్టు. పనులు నిర్వహించటానికి నీటిని మళ్లించే కాఫర్ డ్యాం ద్వారా ఇప్పుడు నీళ్లు ఇవ్వాలని చూడటం ఆత్మహత్యా సదృశమే’ అని హెచ్చరించారు. ఈ ట్వీట్ కు ఓ వార్తాపత్రికలో ప్రచురితమైన కథనాన్ని జతచేశారు..