amit shah: జైశ్రీరాం అని ఇక్కడ కాకపోతే పాకిస్థాన్ లో అనాలా?: అమిత్ షా
- జైశ్రీరాం అనగానే మమత ఉలిక్కి పడుతున్నారు
- పశ్చిమబెంగాల్ లో బీజేపీ 23కు పైగా స్థానాలను గెలుచుకుంటుంది
- జైశ్రీరాం అనకుండా మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు
పశ్చిమబెంగాల్ లో ఎవరైనా, ఎక్కడైనా జైశ్రీరాం అన్న వెంటనే మమతా బెనర్జీ ఉలిక్కి పడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఇదేదో పెద్ద సమస్య అయినట్టు ఆమె ప్రవర్తిస్తుండటాన్ని తాను గమనించానని చెప్పారు. జైశ్రీరాం అని మన దేశంలో కాకపోతే పాకిస్థాన్ లో అంటామా? అని ఎద్దేవా చేశారు. జైశ్రీరాం అనకుండా తమను ఎవరూ ఆపలేరని చెప్పారు. పశ్చిమబెంగాల్ లోని మిడ్నపూర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జైశ్రీరాం నినాదాలు చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు.
పశ్చిమబెంగాల్ లో బీజేపీ 23కు పైగా స్థానాలను గెలుచుకుంటుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. దీదీ తమ ర్యాలీలను అడ్డుకోవచ్చని, అబద్ధాలు ప్రచారం చేయవచ్చని... ఏది చేసినా తాము 23కు పైగా స్థానాలను గెలుచుకోవడాన్ని మాత్రం ఆపలేరని చెప్పారు. మోదీని ప్రధానిగా పరిగణించడం లేదని మమత అంటున్నారని... రాజ్యాంగం ప్రకారం ప్రజలే ప్రధానిని ఎన్నుకుంటారనే విషయం ఆమెకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.