congress: ఢిల్లీలో మాతో పొత్తుకు ఒప్పుకున్న కేజ్రీవాల్ ఆపై మాటతప్పారు: రాహుల్ గాంధీ
- హరియాణా, పంజాబ్ లో కూడా పొత్తు కావాలన్నారు
- అది కుదరకపోవడంతో ఢిల్లీలో కూడా పొత్తు వద్దన్నారు
- బీజేపీకి గెలుపు అవకాశాలను చేరువ చేశారు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఢిల్లీలోని చాంద్ నీ చౌక్ నియోజకవర్గ పరిధిలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య పొత్తు విఫలమవడానికి కారణం కేజ్రీవాలేనని విమర్శించారు. దీంతో, బీజేపీకి గెలుపు అవకాశాలను చేరువ చేశారని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పై అసత్య ప్రచారం చేసిన కేజ్రీవాల్, బీజేపీ గెలుపునకు పరోక్షంగా దోహదపడ్డారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్, ఆప్ లు కలిసి పోటీ చేయాల్సిన అవసరం గురించి కేజ్రీవాల్ కు వివరించి చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అన్నారు.
ఢిల్లీలో రెండు పార్టీల పొత్తుకు తొలుత అంగీకరించిన కేజ్రీవాల్, హరియాణా, పంజాబ్ లలో కూడా పొత్తు అంశాన్ని తీసుకొచ్చారని, అది కుదరకపోవడంతో ఢిల్లీలో పొత్తు వద్దంటూ ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. బీజేపీని కాంగ్రెస్ మాత్రమే అడ్డుకోగలదని, అందుకు, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గఢ్, పంజాబ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలే నిదర్శనమని రాహుల్ చెప్పారు. ఈ సందర్భంగా తన తండ్రి రాజీవ్ గాంధీ పై మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తన కుటుంబాన్ని మోదీ ఎంతగా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆయనపై తనకు ప్రేమ ఉందని రాహుల్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.