Yadadri Bhuvanagiri District: హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి పోలీస్ కస్టడీ
- నిందితుడికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ
- రేపటి నుంచి ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతి
- ఈ మేరకు నల్గొండ జిల్లా కోర్టు ఆదేశాలు
యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ లో వరుస హత్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముగ్గురు విద్యార్థినులను హత మార్చిన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీస్ కస్టడీకి నల్గొండ జిల్లా కోర్టు అనుమతించింది. వరుస హత్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తునకు మరిన్ని ఆధారాలు కావాలంటే నిందితుడిని తాము విచారించాల్సిన అవసరం ఉందని, ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలన్న రాచకొండ పోలీసుల పిటిషన్ పై జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి విచారణ చేపట్టారు. రేపటి నుంచి ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నల్గొండ మొదటి అదనపు జిల్లా కోర్టును రాచకొండ పోలీసులు తొలుత ఆశ్రయించారు. అయితే, ఈ కోర్టుకు ప్రస్తుతం సెలవులు ఉన్నాయి. దీంతో, ఈ కేసు విచారణాధికారి, భువనగిరి ఏసీపీ భుజంగరావు అర్జీ మేరకు నల్గొండ జిల్లా కోర్టులో ఓ పిటిషన్ ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నలమాడ గోపాల కృష్ణ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జిల్లా ప్రధాన న్యాయమూర్తి విచారణ చేపట్టడం జరిగింది.