tejashwi yadav: మోదీ మళ్లీ పీఎం కావడం అసాధ్యం.. పాశ్వాన్ ను చూస్తే బాధ కలుగుతోంది: తేజశ్వి

  • యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది
  • రాహుల్ ప్రధాని కావాలనేది నా కోరిక
  • మా నాన్న బయట ఉండి ఉంటే బీజేపీకి చుక్కలు చూపించేవారు

బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం, మోదీ మళ్లీ ప్రధాని కావడం అసాధ్యమని ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజశ్వి యాదవ్ అన్నారు. జీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజశ్వి మాట్లాడుతూ, తదుపరి ప్రభుత్వాన్ని యూపీఏ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేదే తన ఆకాంక్ష అని మరోసారి తెలిపారు.

తన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తో ఉన్న సంబంధాలపై స్పందిస్తూ, తమ ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉందని తేజశ్వి చెప్పారు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో ఆర్జేడీకి వ్యతిరేకంగా ఏడు స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులను తేజ్ ప్రతాప్ నిలబెట్టడం గమనార్హం.

ఎల్జీపీ అధినేత రామ్ విలాశ్ పాశ్వాన్ తనకు గార్డియన్ లాంటివారని... అయితే, బీహార్ లో ఆయన పార్టీ అన్ని స్థానాల్లో ఓడిపోతుండటం తనకు బాధను కలిగిస్తోందని తేజశ్వి అన్నారు. గత యూపీఏలో ప్రభుత్వం జరిపిన పనులనే ప్రధాని హోదాలో మోదీ ప్రారంభించారని... గత ఐదేళ్లలో సొంతంగా ఒక్క ప్రాజెక్టును కూడా మోదీ పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

కావాల్సిన మెజార్టీకి కంటే కొన్ని తక్కువ స్థానాలకే బీజేపీ పరిమితమయ్యే అవకాశం ఉందంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలపై తేజశ్వి స్పందిస్తూ... బీజేపీ అప్పుడే ఓటమిని అంగీకరిస్తోందని అన్నారు. తన తండ్రి లాలూ ప్రసాద్ జైల్లో కాకుండా బయట ఉండి ఉంటే... బీహార్ లో బీజేపీకి చుక్కలు చూపించేవారని చెప్పారు. మే 23 తర్వాత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కనిపించరని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News