Sun stroke: నేటి నుంచి మరో మూడు రోజులు భానుడి భగభగలు
- బుధవారం అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- 12 నుంచి మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు
- నీటిని అత్యధికంగా తీసుకోవాలంటున్న వైద్యులు
భానుడి భగభగలు మరో మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు, ఎల్లుండి ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత క్రమంగా తగ్గి 40 డిగ్రీలకు చేరుకుంటుందని తెలిపింది. కాగా, బుధవారం గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా 30 డిగ్రీలు నమోదైంది. 12, 13, 14 తేదీల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా నీటిని అధికంగా తీసుకోవాలని చెబుతున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే నీరు అధిక మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే నిమ్మరసం, చెరుకు రసం, మజ్జిగ తాగడం వల్ల ఎండల నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు.