Madhya Pradesh: శివరాజ్ సింగ్ చూపు మందగించిందట.. జ్ఞాపకశక్తి సన్నగిల్లిందట.. ఐడ్రాప్స్, బాదం పంపిన కాంగ్రెస్ కార్యకర్తలు!
- రైతు రుణమాఫీపై శివరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు
- తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్
- మాజీ సీఎం కంటిలో పొర ఏర్పడిందన్న కమల్‌నాథ్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌కు కాంగ్రెస్ కార్యకర్తలు ఐడ్రాప్స్, బాదంపప్పు, చ్యవన్‌ప్రాశ్‌లను పార్శిల్ చేశారు. రైతు రుణాలపై ఆయన అబద్ధాలు చెబుతున్నారని, ప్రభుత్వ నిర్ణయాలు ఆయనకు కనిపించడం లేదని ఆరోపిస్తూ ఆయనకీ పార్శిల్ పంపారు. మాజీ సీఎం చూపు మందగించిందని, జ్ఞాపకశక్తి సన్నగిల్లిందని, అందుకనే ఆయన సరిగా చూడలేకపోతున్నారని, ప్రభుత్వ నిర్ణయాలు గుర్తుండడం లేదని ఆరోపించారు.
ఆయన నిజాలు తెలుసుకోవాలని, పోయిన జ్ఞాపకశక్తి తిరిగి రావాలని కోరుకుంటూ ఐడ్రాప్స్, చ్యవన్‌ప్రాశ్, బాదంపప్పు ప్యాకెట్లను పంపినట్టు తెలిపారు. మరోవైపు, రైతు రుణమాఫీపై చౌహాన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ ప్రభుత్వం 21 లక్షల మంది రైతుల జాబితాను ఆయనకు అందించింది. జాబితాలో ఉన్న రైతులందరి రుణాలను మాఫీ చేసినట్టు పేర్కొంది.
‘‘మాజీ సీఎం చౌహాన్ కంటి చుట్టూ తెల్లని పొర కమ్ముకున్నట్టుగా అనిపిస్తోంది. అందుకనే మేం చేసిన రైతు రుణమాఫీని చూడలేకపోతున్నారు. సురేశ్ పచౌరీ ఆధ్వర్యంలోని బృందం శివరాజ్‌కు 21 లక్షల మంది రైతుల జాబితాను అందించింది. వారందరి రుణాలను మేం మాఫీ చేశాం’’ అని ముఖ్యమంత్రి కమల్ నాథ్ పేర్కొన్నారు.