Andhra Pradesh: అమరావతికి చేరుకున్న కిడారి శ్రావణ్.. మరికాసేపట్లో రాజీనామా!
- సీఎం పేషీ అధికారులతో సమావేశం
- రేపటితో పూర్తికానున్న 6 నెలల గడువు
- గతేడాది నవంబర్ 11న మంత్రిగా బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ గిరిజన, వైద్యశాఖ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పదవీకాలం రేపటితో పూర్తికానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు అమరావతిలోని సచివాలయానికి చేరుకున్నారు. కాగా, శ్రావణ్ కుమార్ తొలుత సీఎంవో అధికారులతో సమావేశమవుతారనీ, ఆ తర్వాత రాజీనామాను సమర్పించే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తులు ఆరు నెలల్లోగా చట్టసభలకు ఎన్నిక కావాల్సి ఉంటుంది.
కిడారి శ్రావణ్ కుమార్ గతేడాది నవంబర్ 11న చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నెల 23న ఫలితాలు రానున్న నేపథ్యంలో మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా కిడారికి చంద్రబాబు సూచించినట్లు సమాచారం.
దీంతో రాజీనామా చేయాలని శ్రావణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు గతేడాది మావోయిస్టుల చేతిలో హత్యకు గురికావడంతో ఆయన కుమారుడు శ్రావణ్ కు చంద్రబాబు మంత్రి పదవిని అప్పగించారు.