Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. ఒక్కరోజులోనే ముగ్గురు మృతి!
- వడదెబ్బతో గుంటూరులో బాలిక మృతి
- తెలంగాణలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు
- జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ప్రజలను బెదరగొడుతున్నాయి. దీంతో ఉదయం 10 గంటలు దాటాక బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. తాజాగా ఏపీ, తెలంగాణలో ఎండ తీవ్రతకు ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు లోనై ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా అగ్నిగుండాల గ్రామంలో అతికాంక్షణ(4) అనే చిన్నారి ఇంటి వద్ద ఎండలో ఆడుకుంటూ అస్వస్థతకు లోనయింది. వాంతులు చేసుకుని సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాకలో నీలయ్య అనే వ్యక్తి వడదెబ్బ తగలడంతో చనిపోయాడు. కాగా, మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లోకి వచ్చిన ఓ యువకుడు ప్లాట్ ఫామ్ పై ఉన్న బెంచీలో కూర్చుని ప్రాణాలు విడిచాడు. దీంతో ఒక్కరోజులోనే వడదెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది.
ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా నీడ పట్టునే ఉండాలనీ, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే, తెలుపు రంగు లేదా తేలికపాటి రంగులున్న దుస్తులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రయాణాలు చేసేవారు తరచూ కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను తీసుకోవాలని చెబుతున్నారు.