Andhra Pradesh: చంద్రబాబూ.. లోకేశ్ ఎమ్మెల్సీ సీటును కిడారికి ఎందుకు ఇవ్వలేకపోయావ్?: విజయసాయిరెడ్డి
- కిడారి కుటుంబాన్ని బాబు ఆదుకుంటామన్నారు
- నక్క జిత్తుల రాజకీయాలపై పేటెంట్ బాబు
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ఏపీ గిరిజన, వైద్య శాఖ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ఈరోజు రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. తండ్రిలా కిడారి కుటుంబాన్ని ఆదుకుంటానన్న చంద్రబాబు.. లోకేశ్ ఎమ్మెల్సీ సీటును కిడారి శ్రావణ్ కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
‘నక్క జిత్తుల రాజకీయాలకు మరో వందేళ్ల పేటెంటు మీదే చంద్రబాబూ. అరకు ఎమ్మెల్యే కిడారిని నక్సల్ హతమారిస్తే, కొడుకు శ్రావణ్ ను మంత్రిని చేశావు. 6 నెలల గడువు ముగిసింది. తండ్రిలా ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అన్నోడివి లోకేశ్ ఎమ్మెల్సీ సీటును శ్రావణ్ కు ఎందుకివ్వలేక పోయావ్?’ అని విమర్శలు గుప్పించారు. కిడారి శ్రావణ్ పదవీకాలం రేపటితో పూర్తికానుంది. దీంతో ఈరోజు రాజీనామా చేసేందుకు ఆయన అమరావతిలోని సచివాలయానికి చేరుకున్నారు.