Congress: నువ్వూ గుజరాతీ, నేనూ గుజరాతీ... చూసుకుందా రా!: మోదీకి సవాల్ విసిరిన శ్యామ్ పిట్రోడా
- రాహుల్ గాంధీతో చర్చించలేకపోతే నాతో చర్చకు రావాలి
- హామీలను తుంగలో తొక్కారు
- స్వీయ ప్రచారం కోసం ప్రజాధనం ఖర్చుపెట్టారు
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై దమ్ముంటే తమతో చర్చకు రావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా. 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎన్నో హామీలు ఇచ్చినా, వాటిని నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించిన పిట్రోడా, ఈ విషయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో చర్చకు రావాలని, లేదంటే తనతోనైనా చర్చకు రావాలని, తాను కూడా ఓ గుజరాతీనే అంటూ చాలెంజ్ చేశారు.
మోదీ స్వీయ ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ పిట్రోడా ఆరోపించారు. భేటీ బచావో, భేటీ పడావో పథకం కోసం కేటాయించిన బడ్జెట్ లో సగం ప్రచారానికే సరిపోయిందని విమర్శించారు. 100 స్మార్ట్ సిటీలు అని ఊదరగొట్టి ఇప్పుడు విస్మరించారని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ఉన్న ఆదాయం తగ్గిపోయేలా చేశారని మండిపడ్డారు.
తలసరి రుణం ఏకంగా 50 శాతం పెరిగిందని అన్నారు. బడ్జెట్ లో విద్యకు కేటాయింపు కూడా 4.9 నుంచి 3.4 శాతానికి పడిపోయిందని ఆరోపించారు.