Telangana: తెలంగాణలో ప్రారంభమైన రెండో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్
- 31 జిల్లాల్లో ప్రారంభమైన రెండో విడత ఎన్నికల పోలింగ్
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్
- రెండో విడతలో ఒక జడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మినహా తెలంగాణలోని 31 జిల్లాల్లో రెండో విడత పరిషత్ ఎన్నికలకు ఈ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 179 జెడ్పీటీసీ, 1,850 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలో ఒక జడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిల్లో ఒక ఎంపీటీసీ మినహా అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికయ్యారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన 218 స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుండగా, మిగతా ప్రాంతాల్లో ఐదు గంటలకు ముగుస్తుంది. ఈ నెల 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు మొదటి దశ పోలింగ్ పూర్తయింది. పోలింగ్ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్సు ఏర్పాటు చేశారు.