Pit Wiper: భారత్ లో 70 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైన అత్యంత అరుదైన విషసర్పం

  • అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో పిట్ వైపర్ పాము
  • గతంలో కనిపించిన నాలుగు పాములు
  • ఇది ఎంతో విషపూరితం

ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో కనిపించిన ఓ అత్యంత అరుదైన పాము మళ్లీ ఇన్నాళ్లకు కనబడడం శాస్త్రవేత్తలను అమితానందానికి గురిచేస్తోంది. దీనిపేరు పిట్ వైపర్. విషపూరితమైన ఈ పాము తాజాగా అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో ప్రత్యక్షమైంది. దాదాపు 70 ఏళ్ల కిందట ఇలాంటివి నాలుగింటిని భారత్ లో చూశారు. ఆ తర్వాత పిట్ వైపర్ భారత్ లో కనిపించడం ఇదే తొలిసారి.

అశోక్ కాప్టెన్ నేతృత్వంలోని సరీసృప పరిశోధకుల బృందం అరుణాచల్ ప్రదేశ్ లోని పశ్చిమ కమెంగ్ జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతంలో పిట్ వైపర్ ను చూసి ఆనందంతో గంతులేసింది. ఇది ముదురు ఎరుపు, గోధుమ రంగుల కలయికతో స్థానిక చెట్ల రంగులతో కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆ పాము తన ఎదుట ఉన్న ఇతర జీవుల శరీరంలోని వేడిని గుర్తించడం ద్వారా వేట సాగిస్తుంది. వేడిని గుర్తించడానికి పిట్ వైపర్ శరీరంలో ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ పిట్ వైపర్లు సంతానోత్పత్తి క్రమంలో గుడ్లు పెడతాయా? లేక నేరుగా పిల్లల్ని కంటాయా? అనే విషయంపై శాస్త్రజ్ఞులు పరిశోధనలు సాగించనున్నారు. కాగా, ఈ పాముకు అరుణాచల్ ప్రదేశ్ పేరుమీదుగా 'ట్రిమెరుసురస్ అరుణాచలెన్సిస్' అని నామకరణం చేశారు.

  • Loading...

More Telugu News