Pepsico: గుజరాత్ రైతులపై అన్ని కేసులు ఉపసంహరించుకున్న పెప్సీ సంస్థ
- తాము అభివృద్ధి చేసిన బంగాళాదుంప పంటను అక్రమంగా పండిస్తున్నారంటూ ఆగ్రహం
- న్యాయస్థానాల్లో రైతులపై దావాలు
- ఒత్తిళ్లకు తలొగ్గిన పెప్సీకో
తాము అభివృద్ధి పరిచిన బంగాళాదుంప పంటను గుజరాత్ రైతులు అనుమతి తీసుకోకుండా పండిస్తున్నారంటూ కొన్నాళ్ల క్రితం బహుళజాతి శీతల పానీయాల సంస్థ పెప్సీకో న్యాయస్థానాలను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే, ఒత్తిడికి తలొగ్గి ఇప్పుడా కేసులన్నింటిని వాపసు తీసుకుంటున్నట్టు పెప్సీ సంస్థ ప్రకటించింది.
పెప్సీకో గతంలో నలుగురు రైతులపై అహ్మదాబాద్ వాణిజ్య వ్యవహారాల న్యాయస్థానంలో, మరో ఐదుగురు రైతులపై ఉత్తర గుజరాత్ లోని మొదాసా జిల్లా కోర్టులో దావా వేసింది. దీనిపై రైతుల హక్కుల సంఘాలు మండిపడ్డాయి. పెప్సీ సంస్థ కార్యాలయాల ఎదుట తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించాయి.
అయితే, పరిస్థితి తమకే ఎదురు తిరుగుతున్న సూచనలు కనిపించడంతో పెప్సీకో వెనక్కి తగ్గింది. ఆ తొమ్మిది మంది గుజరాత్ రైతులకు ఊరట కలిగించేలా న్యాయస్థానాల్లో తాము దాఖలు చేసిన దావాలను వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొంది. దీనిపై గుజరాత్ రైతుల హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
అయితే, ఇలాంటి విపరిణామాలు మరోసారి చోటుచేసుకోకుండా రైతుల హక్కులకు మరింత రక్షణ ఉండేలా కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.