Rahul Gandhi: "అచ్ఛే దిన్ ఆయేంగే" అంటూ అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పుడా ఊసే ఎత్తడంలేదు: రాహుల్ ధ్వజం
- యువతకు ఉపాధి గురించి మాట్లాడడంలేదు
- మోదీపై కోపం లేదు
- ఆయన్ను కూడా ప్రేమతో చూస్తాం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. "అచ్ఛే దిన్ ఆయేంగే" అంటూ అధికారం చేపట్టిన మోదీ ఇప్పుడా ఊసే ఎత్తడంలేదని విమర్శించారు. దేశంలో అనేక చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మోదీ ఒక్క సభలోనూ 'అచ్ఛే దిన్' గురించి మాట్లాడడంలేదని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు, రైతు సమస్యల గురించి మోదీ ఎక్కడా ప్రస్తావించడంలేదని రాహుల్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ లోని సుజాల్ పూర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశాన్ని నడిపించేది ప్రజలేనని, ప్రజల అవసరాల మేరకే ప్రధాని పనిచేయాల్సి ఉంటుందని ఈ ఏఐసీసీ చీఫ్ అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిన నోట్ల రద్దు నిర్ణయంపై ప్రధాని మోదీ ఎవరినీ సంప్రదించలేదని, ఏ దుకాణదారుడ్ని అడిగినా నోట్ల రద్దు నిర్ణయం ఎంత తప్పో చెప్పేవాడని రాహుల్ విమర్శించారు. ప్రశ్నిస్తున్నామన్న కారణంతో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ఎంతో ఆగ్రహంతో ఉన్నారని, కుటుంబ సభ్యులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
అయితే మోదీపై తమకు ఎలాంటి వ్యతిరేక భావన లేదని, అందరిలాగే ఆయన్ను కూడా ప్రేమతో చూస్తామని స్పష్టం చేశారు. ద్వేషాన్ని కూడా ప్రేమతో జయించడం నేర్చుకోవాలంటూ రాహుల్ ఈ సందర్భంగా మోదీకి హితవు పలికారు.