Pawan Kalyan: పవన్ కల్యాణ్ విషయంలో వర్మ హెచ్చరించారు, నవ్వి ఊరుకున్నా: హరీశ్ శంకర్
- పవన్ ను డైరెక్ట్ చేసే అవకాశం ఓ అదృష్టం
- పవన్ తో సినిమా అంటే భారీ అంచనాలుంటాయని వర్మ అన్నారు
- గబ్బర్ సింగ్ నాటి సంగతులు వెల్లడించిన హరీశ్
పవన్ కల్యాణ్, శృతిహాసన్ జంటగా వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ లో రికార్డుల మోతమోగించిన దబాంగ్ స్ఫూర్తిగా తెరకెక్కిన ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా రిలీజై ఏడేళ్లయిన సందర్భంగా హరీశ్ శంకర్ ఆనాటి సంగతులను అందరితో పంచుకున్నారు. గబ్బర్ సింగ్ ద్వారా పవన్ ను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కడం నిజంగా తన అదృష్టం అని, ఆ చిత్రం ప్రకటించిన సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ వచ్చారని తెలిపారు.
'దబాంగ్ సినిమా బాలీవుడ్ లో ఎంతో పెద్ద హిట్' అని వర్మ ఓ హెచ్చరికగా చెప్పారని హరీశ్ గుర్తుచేసుకున్నారు. "నువ్వు సొంతగా స్క్రిప్ట్ లు, డైలాగులు రాయగలవు. అలాంటిది ఇప్పుడీ రీమేక్ ఎందుకు? పైగా పవన్ కల్యాణ్ తో సినిమా అంటే అంచనాలు అందుకోగలవా? అన్నారు. అందుకు నా నుంచి జవాబుగా ఓ చిరునవ్వు వెలువడింది. అది రీమేక్ కాదన్న విషయం నాకు తెలుసు. వర్మతో వాదించడం బాగుండదని ఆగిపోయాను. ఆయనే గబ్బర్ సింగ్ ప్రీమియర్ చూసి నమ్మలేకపోయారు" అంటూ నాటి సంగతులు జ్ఞప్తికి తెచ్చుకున్నారు.