Mamata Banarjee: హిందూ దేవుళ్లు ఎంతమంది ఉన్నారు? వాళ్ల పేర్లేమిటో మీకు తెలుసా?: మోదీపై దీదీ ఫైర్
- హిందుత్వాన్ని తామే భుజాలపై మోస్తున్నామని అనుకుంటున్నారు
- దేశంలో ఎన్ని మతాలున్నా ఏకత్వంలో భిన్నత్వమే మూలస్తంభం
- ఇక్కడి ప్రజలు బెంగాల్ సంస్కృతి ఆచరిస్తారు
ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెబితేనే మండిపడుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోమారు తన ప్రబల విరోధిపై నిప్పులుచెరిగారు. తనను తాను హిందుత్వవాదిగా అభివర్ణించుకునే మోదీకి హిందుత్వం గురించి తెలిసింది చాలా తక్కువని అన్నారు. హిందుత్వాన్ని తామే భుజాలపై మోస్తున్నామని కొందరు చెప్పుకుంటుంటారు, అలాంటివాళ్లు హిందూ దేవుళ్లు ఎంతమంది ఉన్నారో, వాళ్ల పేర్లేమిటో చెప్పాలంటూ పరోక్షంగా మోదీకి సవాల్ విసిరారు.
అసలు, హిందుత్వంలో ఎంతోమంది దేవుళ్లు, దేవతలు ఉన్న విషయం వాళ్లకేమైనా తెలుసా? అని విమర్శించారు. మహంకాళి అవతారాలు ఎన్నో తెలుసా? కనీసం మంత్రాలైనా వచ్చా? లేదా? అంటూ ధ్వజమెత్తారు. అయితే దేశంలో ఎన్నో మతాలున్నా భిన్నత్వంలో ఏకత్వమే భారత సంస్కృతికి మూలస్తంభం అని అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అనేక మతాల ప్రజలు ఉన్నారని, వాళ్లు బెంగాల్ సంస్కృతి ఆచరిస్తారని తెలిపారు.