Congress: జేడీఎస్ నుంచి నేనేమీ బయటకు రాలేదు.. వాళ్లే గెంటేశారు: సిద్దరామయ్య
- బీజేపీ ప్రశ్నకు సమాధానం చెప్పిన సిద్దరామయ్య
- అహింద కార్యకలాపాలకు పాల్పడుతున్నానని బహిష్కరించారు
- దేవెగౌడ నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు
జేడీఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో ఎందుకు చేరాల్సి వచ్చిందన్న ప్రశ్నకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య వివరించారు. తాను జేడీఎస్‌ను వీడలేదని, మాజీ ప్రధాని, ఆ పార్టీ అధినేత దేవెగౌడ తనను పార్టీ నుంచి బహిష్కరించారని పేర్కొన్నారు.
‘‘నేను జేడీఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చానని బీజేపీ నేతలు అడుగుతున్నారు. నేడు జేడీఎస్‌ను విడిచిపెట్టలేదు. మీరు నిజం తెలుసుకోవాలి. నన్ను ఆ పార్టీ బహిష్కరించింది. నేను ‘అహింద’ కార్యకలాపాలకు పాల్పడుతున్నానని, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ నన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పటికైనా మీరు నమ్ముతారని నేను అనుకుంటున్నాను’’ అని సిద్దరామయ్య పేర్కొన్నారు. కర్ణాటకలోకి మైనారిటీలు, వెనకబడి కులాలు, దళితులకు సంబంధించినదే అహింద్.
బీజేపీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ఆర్. అశోక్ ఇటీవల మాట్లాడుతూ.. సిద్దరామయ్య జేడీఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో ఎందుకు చేరారోనని ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు సమాధానంగా సిద్దరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.