Andhra Pradesh: నా తల్లిదండ్రులు కష్టపడే తత్వాన్ని నేర్పారు.. ఆ దేశాల్లో అమ్మలకు పాదపూజ చేస్తారు!: ఏపీ సీఎం చంద్రబాబు
- తల్లులందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు
- అమ్మను గౌరవించడం మనందరి సంస్కారం
- తల్లి, తండ్రి, గురువు, దైవం ఆరాధ్యులు
చిన్నారులకు అమ్మ ఒడే తొలి బడి అనీ, అమ్మే తొలి గురువు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమ్మను గౌరవించడం మనందరి సంస్కారమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమ్మలందరికీ చంద్రబాబు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శిశువుకు ఆది గురువు అమ్మ అనీ, చిన్నారి బుద్ధి వికసించేది అమ్మ ఒడిలోనే అని ఏపీ సీఎం తెలిపారు. విద్యార్థి దశలోనే పిల్లల్లో తల్లిపై ప్రేమ పెంచేలా, తల్లిదండ్రులను గౌరవించేలా సంస్కారం నేర్పించాలని సూచించారు.
తల్లిదండ్రులు తమ బిడ్డలను పెద్దచేసి ప్రయోజకులుగా చేస్తుంటే, వాళ్లు మాత్రం తల్లిదండ్రులను ఆశ్రమాలపాలు చేయడం కలచివేస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి, తండ్రి, గురువు, దైవం ఆరాధ్యులని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు నిరంతర స్ఫూర్తి ప్రదాతలని వ్యాఖ్యానించారు. ‘నా తల్లిదండ్రులు కష్టపడి పనిచేసే తత్వాన్నినేర్పారు. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో పిల్లలు తల్లికి పాదపూజ చేస్తారు’ అని చెప్పారు. తల్లిని గౌరవించడం పిల్లలందరికి నేర్పించాలని పునరుద్ఘాటించారు. అందుకే ఏపీలో ‘అమ్మకు వందనం’ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించే తల్లులకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు.